రేణుకా పుట్టలాంబ కథ
1427 లో బహమని సుల్తాన్ అహమద్ షా ధాటికి రెడ్డి సామ్రాజ్యం పునాధులతో కదిలిపోయింది. తొలి కబళంగా కొండవీడి కూలిపోయింది. వరుసగా అద్దంకి నాగార్జున కొండ బెల్లం కొండ, వినుకొండ, ధరణికోట నేలకూలాయి. ఇక మిగిలింది కొండవల్లి ఖిల్లా.
మహమ్మదీయులు సేనావాహిని ఉప్పెనలా వచ్చి కొండపల్లిని చక్రబంధం చేసింది. ఖిల్లా అజేయంగా తలయెత్తుకు నిలబడింది. అదేమి దురదృష్టమో కోట బీటలు వారకుండానే రెడ్డి రేడు గుండె బీటలు వారింది మంత్రలు సేనానులైన మలిరెడ్డి, కొల్లారెడ్డి వారు దుర్గందుర్భుద్యమని తూర్పు పడమర ద్వారాలను కాచుకుంటే చాలునని అందుకు తగినంత బలం కోటలో ఉందని ఎంతగానో చెప్పారు.
రాజుకు ఈ సలహా రుచించలేదు. తక్షణం కోటను వదలటమే తరుణోపాయమన్నాడు. అందరూ తమ ఇలవేల్పు జగజ్జనని రేణుకాలయానికి వెళ్లారు.
దేవి దుర్నిరీక్షణంగా ఉంది. అందరూ శిరస్సులు వంచి చేతులు జోడించి మనవిగా ‘తల్లీ శత్రువులు కోటను చుట్టు ముట్టారు..కోటను వదలి తరలిపోవాలనుకుంటున్నాము..తమ అనుజ్ఞ’ అని ప్రార్ధించారు. భరించరాని నిశ్శబ్ధం ఘనీభవించింది. అశరీరవాణి పలికింది ‘బిడ్డలారా నేనుండగా భయమేమిటి మీరు ధైర్యంగా నిలబడండి.
ఆ మాటలకు మంత్రులు, సేనానులు వుప్పొంగిపోయారు. రాజు మాత్రం కృంగిపోయారు..చెదరని గుండె చిక్కబరచుకోలేక పోయాడు.
రాజు కోటను వదిలి వెళ్లటానికే నిర్ణయించుకున్నారు. దేవి ఎన్నో విపరీత విపత్కర సమయాల్లో ఆ రాజ్యాన్ని, ఆ రాజు వంశాన్ని రక్షించింది. ఇప్పుడు అవన్న రాజు స్మృతిపథం నుంచి తొలగిపోయాకి కాబోలు! ఒకప్పుడు శత్రువులు అసంఖ్యాకంగా భారీ ఫిరంగులతో వచ్చి కోటను చుట్టుముట్టారు. కోటను సైన్యం తక్కువగా ఉంది. ఇక కొండవల్లి పతనం తపపదనుకున్నారు. ఎవ్వరూ వూహించినట్లుగా, రెడ్డి రాజు విజయం పొందారు. ఆ రోజు రాత్రి దేవి రాజు కలలో కనబడి ‘నాయనా , నాకు ఒక చీర పెట్టవూ’ అని అడిగింది. రాజు ‘అమ్మ నీకు చీరలు కొదవా? అని అన్నాడు. దేవి తూట్లు పడిన తన పమిటి చెంగును చూపుతూ ‘నిన్నటితో యుద్దంలో శత్రు ఫిరంగులు గుండ్లకు మన కోట దగ్ధం కాకుండా ఈ పమిటి చెంగును అడ్డం పెట్టాను ’ అన్నది. రాజు పులకాంకితుడై ఆనంద భాష్పాలు రాల్చాడు. మరునాడు రాజు ఆలయంలో దేవిని విలువ చేసే బంగారు చీరతో అలంకరించాడు.
ఒకసారి రాజు ఏనుగు అంబారీనై కూర్చొని పరివారంతో కోటకు వస్తున్నాడు. మధ్యలో వాగు దాటాలి. వాగులో అంతగా నీళ్లు లేవు. అందరూ వాగుతు దాటుతున్నారు. రాజు అధిరోహించిన మధపుటేనుగు సరిగ్గా వాగులో మద్యలో ఉంది.
హఠాత్తుగా క్షణాల మీద వాగు పొంగి నింగిని అంటుతోంది. పరివారం ఎటు వాళ్లు అటు వురకలు, పరుగులు మీద ఒడ్డుకు చేరారు. గజరాజు కదలలేక అక్కడే నిలబడిపోయాడు. ఆ ఉధృతమైన ప్రవాహానికి ఒడ్డున్న వున్న పెద్ద పెద్ద వృక్షాలే వేళ్లతో పాటు ప్రవాహంలో కొట్టుకు పోతున్నాయి. ఏనుగు కంఠం వరకు నీళ్లు వచ్చాయి. అది తొండం పైకి ఎత్తి ఘీంకారం చేస్తుంది. ప్రవాహం సుడిలో ఏనుగు కొట్టుకొంటుంది. సుడులు తిరుగుతూ అల్లకల్లోలంగా ఉన్న జలరాశి మధ్యలో ఏనుగుపై ఉన్న రాజు ఒక్కడే ఉండిపోయాడు. మరుక్షణంలో పెద్ద అల ఏనుగుతో సహా రాజును ముంచి వేసింది. ఇక రాజు లేడనుకున్నారు అందరూ..
మరుక్షణం ఆశ్చర్యంగా పరువళ్లు తొక్కుతున్న ప్రవాహం మద్య నుంచి ఏనుగు మెల్లగా పైకి వచ్చి ముందుకు నడుస్తుంది. రాజు అంబారీపైన భద్రంగా ఉన్నారు. పెరిగిపోతున్న ప్రవాహం ఈ సారి ఏనుగును కదపలేక పోయింది. ఏనుగుమెల్లగా రాజుతో సహా వడ్డుకు చేరకుంది. అందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. రాజు తన విచిత్రమైన అనుభవాన్ని వివరించి అందర్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేశాడు. ‘ ఏదో వూహించరాని గొప్ప శక్తి ఏనుగునుపైకి ఎత్తి ముందుకు నడిపించినట్లు అనిపించింది. అట్లా కాకపోతే ఏనుగు నేను బయటకు రావడం అసాధ్యం’ అన్నారు.
రాజు కోటలో ప్రవేశించాడు..అప్పుడు రేణుకాలయ పూజారులు ఆలయంలో జరిగిన అత్యద్భుతాన్ని రాజుతో మనవి చేసుకున్నారు. ‘ ఈరోజు ఉదయం ఆలయంలో అమ్మావారిని రోజూ మాదిరి అలంకరించి పూజ చేస్తున్నాము..హఠాత్తుగా ఆశ్చర్యంగా నిలువెత్తు దేవి విగ్రహం నుంచి ప్రవాహంగా నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లలో దేవి మునిగిపోయింది. ఇట్లా ఎందుకు జరిగిందో అర్ధం కాక భయపడి పోతున్నాము’ అన్నారు.
రాజు ఆనందాశ్రువులలోమునిగిపోయారు. కొంత సేపటికి తెప్పరిల్లి ‘ ఓహో..! నా తల్లికి నాపైన ఎంత అనుగ్రహం ! ఎంత అనుగ్రహం ! ప్రవాహంలో నేను మునిగిపోకుండా దేవి వచ్చి నన్నూ.. ఏనుగును ఎత్తిపట్టింది. ఎంత కరుణ, ఎంత కరుణ’ అంటూ పొంగిపోయాడు.
దేవి యొక్క ఈ కరుణా విలాసానికి సూచనగా రాజు అప్పటికప్పుడు దేవి జలక్రీడలకు పెద్ద తటాకాన్ని త్రవ్వించారు.
ఇటువంటి మహిమలు దేవి యెన్నో చేసింది. ఇప్పుడు దేవి అభయాన్ని నమ్మలేక రెడ్డి రాజు కోటను వదిలి పెట్టడానికి నిర్ణయించాడు.
భగవంతుడు ఒకప్పుడు సూచనగా తెలియజేస్తాడు..మరొకప్పుడు అజ్ఞాపిస్తాడు. మరొకప్పుడు బలవంతంగా వశపర్చుకొని ఆ పని చేయిస్తాడు.
ఇక్కడ ఇప్పుడు దేవి రెడ్డిరాజుకు కోటలోనే నిలబడి శత్రువును ప్రతిఘటించమని సూచన చేసింది. ఆ సూచన ను రెడ్డి రాజు అందుకోలేకపోయాడు. ఇది విధివాలాసం కాబోలు.
కొండపల్లి కోట లోపల నుండి భూగర్భసొరంగం కృష్ణానది అడుగు నుంచి ఆవల ఒడ్డుకు ఉంది. అక్కడ నుండి నెల్లూరు కు సమీపంలో వున్న సర్వేపల్లి దుర్గానికి చేరుకోవచ్చు. కొండపల్లి, సర్వేపల్లి దుర్గాధిపతులు అన్నదమ్ములు బిడ్డలు.
రాజు దేవిని పల్లికిలో ఎక్కించుకొని రాణులు,మంత్రులు, సేనానులతో భూగర్భ సొరంగం గుండా వెళుతున్నారు.
అందరూ అవతలి ఒడ్డుకు చేరారు..అరణ్య మార్గం గుండా సర్వేపల్లి దిశగా వెళుతున్నారు. మధ్యలో రేణుకాదేవి పల్లకి ఉంది. కావలి పట్టణాన్ని సమిపిస్తుండగా హఠాత్తుగా పట్టపగలే చీకట్లు కమ్మాయి. అందరూ కలవర పడ్డారు. పల్లకిలో దేవి లేదు..దేవి విగ్రహం పుట్టలోకి దిగిపోతుంది. పుట్ట చుట్టు చేరారు. గుణపాలతో పుట్టను తవ్వుతున్నారు. త్రవ్విన కొద్దీ విగ్రహం పాతాళానికి వెళుతుంది. ఇట్లా కొన్ని రోజులు త్రవ్వారు.
ఒకరోజు త్రవ్వుతుండగా బలంగా వేసిన పలుగు అంచు దేవి ముక్కుపైన తగిలింది. ‘ఇంక నేను మీకు చిక్కను, నా ప్రతిమ చేయించి ఇక్కడే ఉండండి.నేను మిమ్ము సదా రక్షిస్తూ ఉంటాను ’ అని దేవి పలికింది.
రాజు అక్కడే పరివారంతో నిలిచిపోయాడు. దేవికి ఇక ఆలయం కట్టించి పూల తోట, ఉయ్యాల వేయించాడు.
అదేమి చిత్రమో దేవి విగ్రహాన్ని కంచుతో ఎన్నిసార్లు పోతపోసినా ముక్కుమీద గాటు కనిపిస్తూనే ఉంది. అప్పటి నుంచి అమ్మవారిని రేణుకా పుట్టలాంబా అని పిలుస్తారు.